Jessica Case : విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన జెస్సికా మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, ఇది ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని జెస్సికా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జెస్సికా మరణం వెనుక ఆమె స్నేహితుల హస్తం ఉందని కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. హత్యను దాచిపెట్టేందుకే హోటల్‌లోని సీసీ కెమెరాల దిశను మార్చారని వారు ఆరోపిస్తున్నారు. పక్కా ప్లాన్‌తోనే ఆమెను అంతమొందించారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖలోని బి-స్క్వేర్ లాడ్జిలో ఈ నెల 14న 118, 119 నంబర్ గదులను జెస్సికా తన స్నేహితులతో కలిసి అద్దెకు తీసుకుంది. హోటల్ యాజమాన్యం చెబుతున్న దాని ప్రకారం.. జెస్సికా తన ఆధార్ కార్డు సమర్పించి రూమ్ బుక్ చేసింది. అయితే, యువతీ యువకులకు ఒకే గది ఇవ్వడం కుదరదని సిబ్బంది ముందే స్పష్టం చేయడంతో రెండు వేర్వేరు గదులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
జెస్సికాతో పాటు ఆమె స్నేహితులు సాయికిరణ్, యశ్వంత్, లక్ష్మీ సౌజన్య, నరవ సాయికుమార్, పుచ్చ సాయికిరణ్, మణి కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం మత్తులో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనకు మరొకరితో సంబంధం ఉందని జెస్సికా తప్పుడు ప్రచారం చేస్తోంది అనే కోపంతో సాయికిరణ్ ఆమెపై దాడికి దిగాడు. అతడితో పాటు లక్ష్మీ సౌజన్య, యశ్వంత్ కూడా కలిసి జెస్సికాను తీవ్రంగా కొట్టినట్లు సమాచారం.
ఈ దాడి జరిగిన తర్వాతే జెస్సికా మరణించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, తమపై దాడి జరిగిన తర్వాత జెస్సికాకు ఫిట్స్ వచ్చిందని, ఆ తర్వాత ఆమె 118 నంబర్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని స్నేహితులు పోలీసు విచారణలో చెబుతున్నారు. తీవ్ర అవమాన భారంతో ఆమె బలవన్మరణానికి పాల్పడిందా లేక దాడి వల్లనే ప్రాణాలు కోల్పోయిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జెస్సికా తల్లి ఫిర్యాదు మేరకు అరిలోవా పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె స్నేహితులందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
