SDM Kajal Meena: రాజస్థాన్‌లో అవినీతి నిరోధక శాఖ తాజాగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ దాడుల్లో ల్యాండ్ కు సంబంధించిన పని పూర్తి చేయడానికి లంచం తీసుకుంటూ ఒక మహిళా ఎస్డిఎమ్ (SDM), ఆమె సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు
కరౌలి జిల్లా నాదోతిలో సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కాజల్ మీనా, తన కింద పనిచేసే రీడర్ దినేష్ కుమార్ సైనీ, సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ధాకడ్లతో కలిసి రూ. 60,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సవాయ్ మాధోపూర్ ఏసీబీ యూనిట్ ఈ దాడులు నిర్వహించింది. వీరి వద్ద నుంచి లంచం డబ్బుతో పాటు, లెక్క చూపని మరో రూ. 4 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బాధితుడు తన భూమికి సంబంధించి అంతిమ ఉత్తర్వు జారీ చేయాలని ఎస్డిఎమ్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. ఈ పని చేయడానికి ఎస్డిఎమ్ కాజల్ మీనా తన రీడర్ ద్వారా మొదట రూ. లక్ష డిమాండ్ చేశారు. చివరకు అది రూ. 50,000 కు సెటిల్ అయ్యింది. అయితే, రీడర్ దినేష్ కుమార్ తన కోసం అదనంగా మరో రూ. 10,000 అడిగాడు. మొత్తం రూ. 60,000 లంచం ఇస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి వారిని పట్టుకుంది.
అరెస్ట్ అయిన కాజల్ మీనా నేపథ్యం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఐఐటి మండి నుంచి బి.టెక్ పూర్తి చేశారు. 2024 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (RAS) అధికారిణి అయిన ఆమె, ఎస్టీ కేటగిరీలో టాపర్‌గా నిలిచారు. గతంలో టోంక్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో పనిచేశారు.
గతంలో తన ఇంటర్వ్యూ సమయంలో కాజల్ మీనా మాట్లాడుతూ.. “ఒక పరిపాలనా అధికారి తనకున్న అధికారంతో సామాన్య ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావచ్చు” అని చెప్పారు. కానీ, ఇప్పుడు అదే అధికారంతో ప్రజలను వేధిస్తూ లంచం తీసుకుంటూ దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న రూ. 4 లక్షల గురించి విచారణ జరుపుతున్నారు. ఆ నగదు కూడా వేరే వ్యక్తుల నుంచి వసూలు చేసిన లంచం కావచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
