Trinamool Congress : ఫస్ట్ వికెట్ పడింది.. మమతకు దిమ్మతిరిగే షాక్ : బాంబు పేల్చిన మాజీ మంత్రి!

Trinamool Congress

Trinamool Congress :  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన మరుసటి రోజే ఆ పార్టీకి చెందిన మాజీ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారీ బాంబు పేల్చారు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని పార్టీ తనను అడిగిందని, తాను నిరాకరించినందుకే ఈసారి టికెట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

మనోజ్ తివారీ మాట్లాడుతూ.. “టీఎంసీ ఓటమి నాకు ఆశ్చర్యం కలిగించలేదు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీకి ఇది తగిన శాస్తే. ఈసారి కనీసం 70-72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 5 కోట్లు చెల్లించి టికెట్లు కొనుక్కున్నారు. నన్ను కూడా అడిగారు, కానీ నేను లంచం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్న వారిలో ఎంతమంది గెలిచారో ఒకసారి చూసుకోండి” అని ఎద్దేవా చేశారు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని తివారీ మండిపడ్డారు. తనకు ఇచ్చిన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి (MoS) పదవి ఒక లాలీపాప్ వంటిదని, దానికి ఎటువంటి అధికారాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. “మేము ఏదైనా సమస్య గురించి దీదీ (మమత) దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే.. మాకు మీకోసం సమయం లేదు అని మధ్యలోనే ఆపేసేవారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

క్యాబినెట్ మంత్రి అరూప్ బిశ్వాస్ తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “బిశ్వాస్‌కు క్రీడల గురించి ఏమీ తెలియదు. నా ఫోటోలు క్రీడా పేజీల్లో వస్తాయని భయపడి, నన్ను క్రీడా వేడుకలకు పిలిచేవారు కాదు. చివరకు మెస్సీ కోల్‌కతా పర్యటనను కూడా రాజకీయ నేతలు ఒక గందరగోళంగా మార్చేశారు” అని విమర్శించారు. తన నియోజకవర్గమైన శిబ్‌పూర్‌లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నిధులు ఇవ్వకపోగా, తన సొంత డబ్బులతో కొన్ని పనులు చేయించానని ఆయన వెల్లడించారు.

రాజకీయాలకు స్వస్తి పలికిన మనోజ్ తివారీ, తిరిగి క్రికెట్ వైపు అడుగులు వేస్తున్నారు. బీసీసీఐ లెవల్ 2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆయన, బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు.