Wayanad : వాయనాడ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదైంది. అజేయ నాయకుడిగా పేరుగాంచిన సీపీఎం దిగ్గజం, రాష్ట్ర మంత్రి ఓ.ఆర్. కేలు తన రాజకీయ ప్రస్థానంలో తొలిసారి ఓటమిని చవిచూశారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఉషా విజయన్ ఆయనపై ఘనవిజయం సాధించి, కంచుకోటను బద్దలు కొట్టారు. ఇక్కడ ఎస్టీ (ST) రిజర్వ్డ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఉషా విజయన్ తన ప్రత్యర్థి, సీపీఎం సీనియర్ నేత ఓ.ఆర్. కేలుపై 10,543 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఒక సామాన్య మహిళా నాయకురాలు, రాష్ట్ర స్థాయి మంత్రిని ఓడించడం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఓ.ఆర్. కేలుకు అపజయమెరుగని నాయకుడిగా పేరుంది. తిరునెల్లిలో వార్డు మెంబర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి, పంచాయతీ ప్రెసిడెంట్‌గా, బ్లాక్ పంచాయతీ సభ్యుడిగా ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. 2016 మరియు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన వరుస విజయాలు సాధించి రాష్ట్ర మంత్రిగా ఎదిగారు. అయితే, మూడోసారి హ్యాట్రిక్ కొడతారని భావించిన తరుణంలో ఉషా విజయన్ ఆయన విజయయాత్రకు బ్రేక్ వేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తూ ప్రజలకు చేరువైన ఉషా విజయన్, ఈ ఎన్నికల్లో చాలా నిశ్శబ్దంగా తన ప్రచారాన్ని సాగించారు. ఆదివాసీ ప్రాంతాల్లో భూమి హక్కులు, జీవనోపాధి మరియు సంక్షేమ పథకాల అమలు వంటి క్షేత్రస్థాయి సమస్యలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నారు. నియోజకవర్గంలోని సామాన్య ప్రజలతో ఆమెకున్న అనుబంధం ఈ భారీ విజయానికి దారితీసింది.
సిట్టింగ్ మంత్రి, అదీ కంచుకోట లాంటి ఎస్టీ బెల్ట్‌లో ఓడిపోవడం సీపీఎం శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, స్థానిక సమీకరణాల్లో వచ్చిన మార్పులే కేలు ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలింగ్‌కు ముందు రోజే మంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయడం వంటి పరిణామాలు, ఓటమిని వారు ముందే ఊహించారా అనే సందేహాలకు తావిస్తున్నాయి.
మొత్తానికి, అట్టడుగు స్థాయి నుండి వచ్చిన ఒక మహిళా నాయకురాలు, ఒక శక్తివంతమైన మంత్రిని ఓడించడం ద్వారా మనంతవాడి రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించారు.
