Bandla Ganesh : ఒరేయ్ నువ్వెవడివిరా.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్!

Bandla Ganesh :  జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన పరోక్ష సెటైర్లపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది. అత్యంత ఘాటుగా ఆయన చేసిన విమర్శలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించుతామని, తాము పోటీకి సిద్ధంగా ఉన్నామంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. “మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్‌గా వస్తున్నారా? అది చెప్పి రండి” అంటూ ఎద్దేవా చేశారు. గతంలోనూ పవన్ రాజకీయ నిర్ణయాలపై విమర్శలు చేసిన ప్రకాశ్ రాజ్.. ఈసారి తెలంగాణ ఎన్నికల ఎంట్రీని టార్గెట్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ జనసైనికులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ భక్తుడిగా చెప్పుకునే నిర్మాత బండ్ల గణేశ్ ఏమాత్రం ఉపేక్షించలేదు. వెంటనే తన స్టైల్లో అత్యంత పదునైన, ఘాటు పదజాలంతో ప్రకాశ్ రాజ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. “ఒరేయ్.. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయ్” అంటూ బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.

ఈ ఇద్దరు సీనియర్ నటుల మధ్య నడుస్తున్న ఈ ట్విట్టర్ వార్‌పై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.