Doctor Re-Breaks Child’s Leg: లంచం ఇవ్వలేదని.. అతికిన ఎముకను మళ్లీ విరిచిన డాక్టర్

Doctor Re-Breaks Child's Leg

Doctor Re-Breaks Child’s Leg: “శవాల మీద చిల్లర ఏరుకోవడం” అనే మాట ఎప్పుడైనా విన్నారా.. పోనీ ఎప్పుడైనా అలాంటి మనుషులను ఎప్పుడైనా చూశారా.. అవును మనం చెప్పుకోబోయేది ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించే. లంచం ఇవ్వలేదన్న కారణంతోనే ఓ సర్కార్ డాక్టర్ (Doctor ) చేసిన పని ఇప్పుడు మానవత్వానికి చెరగని మచ్చగా నిలిచిపోయింది. ఉచితంగా వైద్యం చేయాల్సింది పోయి.. డబ్బులకు కక్కుర్తి పడ్డాడు. అడిగినంత ఇవ్వలేదని ఓ బాలికకు అతికిన ఎముకను మళ్లీ విరిచేసి, కర్కశంగా ప్రవర్తించాడు. 14 ఏళ్ల మానసిక వికలాంగురాలైన కుమార్తెను తీసుకుని ఓ మహిళ కలెక్టరేట్ మెట్లెక్కింది. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడిన తన కుమార్తెను తీసుకువచ్చింది. ఆపరేషన్ కోసం వైద్యుడు మొత్తం రూ. 25,000 డిమాండ్ చేయగా, అందులో తల్లి రూ. 8,000 చెల్లించింది. మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి ఆమె నిరాకరించింది. ఆమె ఆ ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నందున, ఉచితంగా చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగం గతంలోనే వైద్యుడికి సూచించింది. అయినప్పటికీ డబ్బులు చేయడమే కాకుండా.. అప్పటికే గాయంతో బాధపడుతున్న చిన్నారి కాలును బలవంతంగా విరిచేయడం వివాదాస్పదంగా మారింది.

జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించిన మహిళ

ఈ విషయంపై సదరు బాలిక తల్లి న్యాయం కోరుతూ, జిల్లా కలెక్టరేట్‌ను ఆశ్రయించింది. రష్మా చెప్పిన ప్రకారం, సుమారు నెలన్నర క్రితం జిల్లా ఆ ఆసుపత్రిలో ఆమె కుమార్తె కుడి కాలికి శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ కోసం ఆసుపత్రి సిబ్బంది మొదట రూ. 25,000 డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. వితంతువు, అందులోనూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, ఆ డబ్బు చెల్లించలేనని ఆమె చెప్పడంతో, బాలికకు చికిత్సను నిరాకరించారని ఆమె తెలిపింది.

ఆ తర్వాత ఆమె జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించగా, ఆయన ఉచిత చికిత్స అందేలా చూడాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO)ను ఆదేశించారు. అయినప్పటికీ, మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లించవచ్చని హామీ ఇచ్చి, ఆసుపత్రి సిబ్బంది రూ. 8,000 వసూలు చేశారని ఆమె వెల్లడించింది. మరో మారు టెస్టింగ్ కోసం వెళ్లగా ఆపరేషన్ కి రిఫర్ చేసిన డాక్టరే పాప మోకాలిని వంచారని, దానివల్ల పాప నొప్పితో కేకలు వేయడంతో పాటు కాలు విరిగే శబ్దం వచ్చిందని మహిళ చెప్పింది. దీంతో పాప పరిస్థితి మరింత దిగజారిందని వాపోయింది.

ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. ఎవరూ తన గోడును పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై స్పందిస్తూ, అవతలి పక్షం వాదన వినకుండా ఒక నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ సునీల్ తివారీ అన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని, ఏదైనా నిర్లక్ష్యం గానీ, లేదా తప్పు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: Peddi Review : కుమ్మేశావ్ రా చిట్టిబాబు.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో!