Vijay Deverakonda––Rashmika : టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నల పెళ్లిపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చేసింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ, వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 2026 ఫిబ్రవరి 26న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోయినా, వైరల్ అవుతున్న కార్డ్, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఒక పురాతన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య కేవలం కొద్దిమంది అతిథులతో మాత్రమే ఈ వేడుక ప్రైవేట్‌గా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24 నుండే ప్రీ-వెడ్డింగ్ వేడుకలు మొదలవుతాయని తెలుస్తోంది. అటు కూర్గి (Coorg) సంప్రదాయం, ఇటు తెలుగు పద్ధతులలో ఈ పెళ్లి జరగబోతోందని సమాచారం.

పెళ్లి కేవలం కొద్దిమంది మధ్యే జరిగినా, సినిమా ఇండస్ట్రీ మిత్రుల కోసం, శ్రేయోభిలాషుల కోసం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వైరల్ అవుతున్న ఇన్విటేషన్ ప్రకారం, 2026 మార్చి 4 (బుధవారం) సాయంత్రం 7 గంటల నుండి బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 60 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, తమ పెళ్లిని కేవలం ఒక ప్రైవేట్ వేడుకలాగే ఉంచుకోవాలని, దీన్ని వ్యాపారం చేయకూడదని విజయ్-రష్మిక ఈ భారీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండటంతో అభిమానులు ఆనందంతో ఊగిపోతున్నారు.
