Rajya Sabha 2026 : రాజ్యసభ ఎన్నికల నగారా.. నేటి నుంచే నామినేషన్లు!

Rajya Sabha 2026 : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. పది రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టగా, నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవ్వడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

నామినేషన్ల దాఖలుకు మార్చి 5వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం, మార్చి 6వ తేదీన అధికారులు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించనున్నారు (స్క్రూటినీ). ఒకవేళ ఎవరైనా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని భావిస్తే, వారికి మార్చి 9వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ గడువు ముగిసిన తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత రానుంది.

ఇక అత్యంత కీలకమైన పోలింగ్ ప్రక్రియ మార్చి 16వ తేదీన నిర్వహించనున్నారు. అదే రోజు ఉదయం నుంచి పోలింగ్ జరగనుండగా, సాయంత్రం కౌంటింగ్ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ 37 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కేది ఎవరన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.