Speaker Khader : ప్రస్తుత రాజకీయాల్లో స్పీకర్ అంటే అధికార పార్టీకి కొమ్ముకాసే వ్యక్తి.., సభలో మంత్రులను వెనకేసుకొచ్చే పదవి.. అని ఒక ముద్ర పడిపోయింది. కానీ, కర్ణాటక స్పీకర్ యు.టి.ఖాదర్ ఆ ముద్రను చెరిపివేశారు. తను ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారో ఆ పార్టీ ప్రభుత్వానికే చమటలు పట్టించారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.
సోమవారం అసెంబ్లీలో హోంమంత్రి జి. పరమేశ్వర ప్రవేశపెట్టిన సమాధానాల్లో తీవ్ర జాప్యం కనిపించింది. ఎమ్మెల్యేలు అడిగిన 239 ప్రశ్నలకు గాను కేవలం 84 సమాధానాలు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు మండిపడటంతో స్పీకర్ కూడా తన అసహనాన్ని ఆపుకోలేకపోయారు.
గతవారమే మంత్రులను స్పీకర్ హెచ్చరించారు. అయినా మార్పు రాకపోవడంతో సోమవారం స్పీకర్ కొరడా ఝళిపించారు. “నేను ఇక్కడ కూర్చున్నది మంత్రుల కోసం కాదు.. సభ్యుల హక్కులను కాపాడటం కోసం.. ఈ సమస్యను పరిష్కరించేంత వరకూ సభను నడపలేను” అంటూ ఏకంగా సభను వాయిదా వేసి కుర్చీ దిగి వెళ్ళిపోయారు. ఒక స్పీకర్ ఇలా నిరసన తెలపడం దేశ చరిత్రలోనే అరుదు.
దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా.. మంత్రులందరూ స్పీకర్ కార్యాలయానికి పరుగులు పెట్టారు. చివరకు సిద్ధరామయ్య స్వయంగా ఇది తమ తప్పేనని అంగీకరిస్తూ ప్రకటన ఇచ్చారు. స్పీకర్ పదవికి వన్నె తెచ్చారంటూ ఖాదర్ ను విపక్షాలు ప్రశంసలతో ముంచెత్తాయి.
దేశంలోని మిగిలిన రాష్ట్రాల స్పీకర్లు కూడా ఖాదర్ లాగా ముక్కుసూటిగా వ్యవహరిస్తే.. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది. సభలో పార్టీ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. అధికార పక్షం తప్పు చేసినా, మంత్రులు నిర్లక్ష్యంగా ఉన్నా నిలదీసే ధైర్యం ఉండాలి. అప్పుడే ఓటర్లు ఇచ్చిన తీర్పుకు, ప్రజాభిప్రాయానికి నిజమైన గౌరవం దక్కుతుంది. రాజ్యాంగాన్ని కాపాడాలంటే చట్టాలు మాత్రమే ఉంటే సరిపోదు.. ఖాదర్ లాంటి నిబద్ధత గల వ్యక్తులు ఆ కుర్చీలో కూర్చోవాలి. హ్యాట్సాఫ్ టు యు.టి. ఖాదర్ సర్!
