Monalisa : సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే పెళ్లిలో ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. మోనాలిసా మైనర్ అని, తప్పుడు పత్రాలతో ఆమెకు పెళ్లి చేశారని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) జరిపిన విచారణలో తేలింది. ఈ షాకింగ్ నిజం బయటపడటంతో ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
మోనాలిసాను మేజర్ అని నమ్మించి కేరళలోని ఒక ఆలయంలో వివాహం జరిపించారు. ఇందుకోసం ఆధార్ కార్డులోని తప్పుడు వయసును వాడారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులను కమిషన్ పరిశీలించగా.. ఆమె అసలు పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2009 అని తేలింది. అంటే పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే.
కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నేతృత్వంలోని బృందం కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు కేవలం 72 గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసింది. మున్సిపల్ కౌన్సిల్ జారీ చేసిన తప్పుడు బర్త్ సర్టిఫికేట్‌ను గుర్తించి, దాన్ని రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ పెళ్లి వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, కొన్ని సంస్థల ప్రమేయం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాల్య వివాహం చేయడమే కాకుండా, మైనర్ అని తెలిసి కూడా తప్పుడు పత్రాలు సృష్టించినందుకు ఫర్మాన్ ఖాన్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అతనిపై పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఫర్మాన్ ఖాన్ జైలుకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఉదంతాన్ని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ కేసుపై వివరణ ఇచ్చేందుకు ఏప్రిల్ 22, 2026న కేరళ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలను (DGP) తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు వదిలే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది.
