Raghav Chadha : రాఘవ్ చద్దాకు దిమ్మతిరిగే షాక్.. బీజేపీలోకి వెళ్లగానే 10 లక్షల మంది అవుట్!

raghav chadha

Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీని వదిలి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చద్దా, తనతో పాటు ఆరుగురు రాజ్యసభ ఎంపీలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లారు. దీనివల్ల కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అయితే, ఆయన తీసుకున్న ఈ నిర్ణయం యువతకు, ముఖ్యంగా జెన్-జీ వాళ్లకు అస్సలు నచ్చలేదు.

ఈ రోజుల్లో రాజకీయ నాయకుల పాపులారిటీకి సోషల్ మీడియానే కొలమానం. రాఘవ్ చద్దా బీజేపీలోకి వెళ్లిన 24 గంటల్లోనే ఆయన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గిపోయారు. శుక్రవారం నాడు ఆయనకు 14.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా, శనివారం మధ్యాహ్నం కల్లా ఆ సంఖ్య 13.5 మిలియన్లకు పడిపోయింది.

రాఘవ్ చద్దా గతంలో సామాన్యుల సమస్యలపై స్పందించే విధానం యువతను బాగా ఆకట్టుకుంది. పితృత్వ సెలవులు, ట్రాఫిక్ సమస్యలు, టెలికాం కంపెనీల డేటా లిమిట్స్, చివరికి ఎయిర్‌పోర్టుల్లో ఖరీదైన సమోసాల గురించి కూడా ఆయన రాజ్యసభలో మాట్లాడేవారు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల కష్టాలు తెలుసుకోవడానికి ఆయన స్వయంగా ఒకరోజు డెలివరీ బాయ్‌గా కూడా పనిచేశారు. 10 నిమిషాల డెలివరీ డెడ్ లైన్ మార్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయన్ని అందరూ తమ నాయకుడని భావించేవారు.

ప్రముఖ నటి పరిణీతి చోప్రా భర్త అయిన చద్దాను కొందరు అభిమానులు జెన్-జీ పార్టీ పెట్టమని సలహా ఇచ్చేవారు. ఒకవేళ ఆయన వేరే పార్టీలో చేరితే ఇబ్బందులు తప్పవని గతంలోనే ఒక యూజర్ హెచ్చరించగా, చద్దా దాన్ని ఒక ఆసక్తికరమైన ఆలోచనని పేర్కొన్నారు. కానీ ఆయన అనూహ్యంగా బీజేపీని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బీజేపీలో చేరిన వెంటనే చద్దా తన పాత సోషల్ మీడియా పోస్టులను తొలగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీని, బీజేపీని గతంలో విమర్శించిన పోస్టులన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు ఆయన టైమ్‌లైన్‌లో మోదీని పొగిడే పోస్టులు మాత్రమే ఉన్నాయని ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.

మౌంటెనీర్ రోహ్తాష్ ఖిలేరి వంటి ప్రముఖులు కూడా ఆయన్ని అన్-ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో #unfollowRaghavChadha అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. డేటాపై పట్టున్న రాఘవ్ చద్దా, తన ఫాలోయింగ్ మళ్ళీ పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారో చూడాలి.