Narendra Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడం దేశ చరిత్రలోనే ఒక కీలక ఘట్టమని, చరిత్ర సృష్టించడానికి పార్లమెంటుకు ఇది ఒక సువర్ణ అవకాశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. లోక్సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని సగం జనాభాకు అధికారం కల్పించడం అనేది ఒక అద్భుతమైన అవకాశమని కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలని, వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళలకు అధికారం కల్పించడం అంటే అది వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కీలక అడుగు అని ప్రధాని అభివర్ణించారు. మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తే వారు దేశానికి సరికొత్త దిశను చూపిస్తారని మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా ఈ బిల్లు కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది సాకారం కాలేదని.. ఇప్పుడు ఆ కల నెరవేరే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రాముఖ్యతను వివరిస్తూ.. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారిని దేశంలోని మహిళా లోకం క్షమించదని, అప్పట్లో వ్యతిరేకించిన వారిని ఎన్నికల్లో ప్రజలే ఓడించారని ప్రధాని గుర్తు చేశారు. ఈ బిల్లును తీసుకురావడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, కేవలం దేశాభివృద్ధిని కాంక్షించే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలపాలని, అప్పుడే మహిళా సాధికారతకు పూర్తి అర్థం లభిస్తుందని ప్రధాని మోదీ కోరారు.
