TVK Manifesto : ఓర్ని.. విజయ్ కూడా ఇంతేనా.. TVK సంచలన మేనిఫెస్టో!

TVK election manifesto

TVK Manifesto : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. కేవలం ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తున్నామని చెబుతూ, సంక్షేమం, ఉపాధికి పెద్దపీట వేసింది.

రాష్ట్రంలోని 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి మహిళా కుటుంబ పెద్దకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని టీవీకే హామీ ఇచ్చింది. దీనితో పాటు ప్రతి కుటుంబానికి ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అంతేకాకుండా, పేద కుటుంబాల్లో వివాహం చేసుకునే వధువులకు ఒక తులం బంగారం, పట్టుచీరను వివాహ కానుకగా అందజేస్తామని ప్రకటించారు.

ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ఉచిత నివాస పాఠశాలలను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఉన్నత చదువుల కోసం ఎటువంటి షూరిటీ లేకుండా రూ.20 లక్షల వరకు విద్యా రుణం పొందేలా ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు. ఇక నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా.. ఉద్యోగం లేని పట్టభద్రులకు నెలకు రూ. 4,000, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతిని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న రైతులకు చెందిన పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని టీవీకే హామీ ఇచ్చింది. చెరకు రైతులకు మద్దతు ధరగా టన్నుకు రూ. 4,500 అందజేస్తామన్నారు. ఆరోగ్య పరంగా చూస్తే, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని కల్పిస్తామని తెలిపారు. అలాగే, తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు.

టీవీకే మేనిఫెస్టో హైలైట్స్

మహిళాలక నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు.
వధువుకు ఒక తులం బంగారం,పట్టుచీర.
గ్రాడ్యుయేట్లకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.2,500.
50 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన.
చిన్న రైతుల పంట రుణాలు పూర్తి మాఫీ, చెరకు టన్నుకు రూ.4,500 మద్దతు ధర.
రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.20 లక్షల వరకు విద్యా రుణం గ్యారెంటీ.
ఉచిత నివాస పాఠశాలలు, డ్రగ్స్ రహిత తమిళనాడు లక్ష్యం.

అయితే విజయ్ మేనిఫెస్టో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. చదువుకున్న విజయ్ రాజకీయాల్లో మార్పు తీసుకువస్తాడు అనుకుంటే ఆయన కూడా అందరి లాగే బంగారం, డబ్బులు లాంటి ఆఫర్లు ఇచ్చి ఓట్లు అడగడం చూసి షాక్ అవుతున్నారు.