Aadhaar Card : మీరు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే మీకో ముఖ్యమైన వార్త. మీ ఆధార్‌లోని అడ్రస్, పేరు వంటి వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు జూన్ 14 వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత అప్‌డేట్ చేయాలంటే ప్రభుత్వం ఫీజు వసూలు చేస్తుంది. ఈ వివరాలు అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో బ్యాంక్ పనులు ఆగిపోవడం లేదా రేషన్, పెన్షన్ వంటి ప్రభుత్వ పథకాలు అందడంలో ఇబ్బందులు రావచ్చు.
అప్‌డేట్ ఎందుకు చేసుకోవాలి?
సాధారణంగా పదేళ్ల కాలంలో మనం ఇల్లు మారవచ్చు లేదా మన గుర్తింపు వివరాల్లో మార్పులు రావచ్చు. అందుకే మీ ఆధార్ డేటా కరెక్ట్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేయడం వల్ల బ్యాంక్ కేవైసీ (KYC) పనులు సులభంగా అవుతాయి.
ఉచితంగా ఎలా చేయాలి?
- మీరు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేయవచ్చు.
- ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్, ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP)తో లాగిన్ అవ్వాలి.
- అక్కడ ‘డాక్యుమెంట్ అప్‌డేట్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- మీ పేరు, అడ్రస్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని.. ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ లేదా రేషన్ కార్డును ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
- మీరు అప్‌లోడ్ చేసే ఫోటోలు క్లియర్‌గా ఉండాలి.
- మీ కార్డులోని పేరు, ఆధార్‌లోని పేరు ఒకేలా ఉండాలి.
- జూన్ 14 దాటితే మాత్రం ఈ పనికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
