Canada : కెనడాకు వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ శాఖ ఊరటనిచ్చే వార్త అందించింది. ఏప్రిల్ 15తో ముగిసిన నెలవారీ నివేదిక ప్రకారం, వివిధ కేటగిరీల వీసా ప్రాసెసింగ్ సమయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా విజిటర్ వీసాలు, స్టూడెంట్ వీసాల కోసం వేచి చూసే సమయం గణనీయంగా తగ్గింది.
గతంలో భారతీయుల విజిటర్ వీసా దరఖాస్తులను పరిశీలించడానికి దాదాపు 37 రోజులు పట్టేది, కానీ ఇప్పుడు ఆ సమయాన్ని కేవలం 23 రోజులకు తగ్గించారు. అంటే దాదాపు రెండు వారాల ముందే వీసా వచ్చే అవకాశం ఉంది. అలాగే కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కూడా శుభవార్త చెబుతూ, గతంలో ఉన్న 4 వారాల స్టడీ పర్మిట్ ప్రాసెసింగ్ సమయాన్ని 3 వారాలకు తగ్గించారు.
కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి ఉపయోగపడే ‘సూపర్ వీసా’ విషయంలో కూడా కెనడా వేగం పెంచింది. భారతీయుల సూపర్ వీసా ప్రాసెసింగ్ సమయం 202 రోజుల నుండి 182 రోజులకు తగ్గడం విశేషం. అయితే విజిటర్, స్టడీ వీసాల పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, వర్క్ పర్మిట్ల విషయంలో మాత్రం భారతీయులకు వెయిటింగ్ పీరియడ్ స్వల్పంగా పెరిగింది.
గత నెలలో 7 వారాలుగా ఉన్న వర్క్ పర్మిట్ ప్రాసెసింగ్ సమయం ఇప్పుడు 8 వారాలకు చేరుకుంది. అమెరికా వంటి దేశాలకు ఈ సమయం తగ్గినప్పటికీ, భారత్ నుండి దరఖాస్తు చేసేవారికి మాత్రం ఒక వారం అదనపు సమయం పడుతోంది.
ఈ మార్పులు కేవలం భారత్‌కే పరిమితం కాకుండా అమెరికా, నైజీరియా, పాకిస్థాన్ వంటి దేశాల పట్ల కూడా మారుతూ వచ్చాయి. అమెరికా దరఖాస్తుదారులకు విజిటర్ వీసా సమయం స్వల్పంగా పెరిగినప్పటికీ, వర్క్ పర్మిట్ సమయం తగ్గింది. ప్రస్తుత దరఖాస్తుల సంఖ్య , సిబ్బంది పని ఒత్తిడిని బట్టి ఈ ప్రాసెసింగ్ సమయాలు మారుతూ ఉంటాయని, దరఖాస్తుదారులు వీటిని ప్రామాణికంగా తీసుకుని తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం సూచించింది.
