TVK Vijay : ఫ్యాన్ అంటే వీడురా.. మస్కట్ నుంచి వచ్చి విజయ్ను గెలిపించాడు

vijay fan

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తిరుపత్తూరు నియోజకవర్గం ఉత్కంఠభరితమైన ఘట్టానికి వేదికైంది. ఇక్కడ తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి శీనివాస సేతుపతి కేవలం ఒక్క ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థిపై సంచలన విజయం సాధించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంత విలువైనదో చాటిచెప్పేలా ఈ గెలుపు నిలిచింది. ఒకే ఒక్క ఓటుతో అభ్యర్థి తలరాత మారిపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ గెలుపు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. విజయ్ అంటే ఎంతో అభిమానం ఉన్న ఒక వ్యక్తి, తన ఓటును వృథా చేయకూడదన్న ఉద్దేశంతో ఏకంగా మస్కట్ నుండి ప్రయాణమై వచ్చి మరీ తిరుపత్తూరులో ఓటు వేశారు. సరిగ్గా అదే ఒక్క ఓటు తేడాతో టీవీకే అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ఆ అభిమాని గనుక ఓటు వేయడానికి రాకపోయి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కౌంటింగ్ సమయంలో చివరి నిమిషం వరకు ఇద్దరు అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. రీ-కౌంటింగ్ జరిగినప్పటికీ, శీనివాస సేతుపతి ఒక్క ఓటు ఆధిక్యంతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. ఈ గెలుపుతో టీవీకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. “ఒక్క ఓటు ఏముందిలే” అని నిర్లక్ష్యం చేసే వారికి, ఈ తిరుపత్తూరు ఫలితం ఒక గొప్ప గుణపాఠమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.