Vijay Caste : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించిన వేళ, సోషల్ మీడియాలో ఆయన కులంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విజయ్ తమ కులస్తుడంటే, తమ కులస్తుడంటూ పలు వర్గాలు వాదించుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా, విజయ్ దళితుడు లేదా మాదిగ కులస్తుడు కాదని వాస్తవాలు చెబుతున్నాయి. విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖరన్ కాథలిక్ క్రిస్టియన్ కాగా, తల్లి శోభ ఒక హిందువు. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్. ఆయన రోమన్ క్యాథలిక్ మతానికి చెందిన వారైనప్పటికీ, సామాజికంగా ఆయన వెల్లాలార్ కులానికి చెందిన వారు.
వెల్లాలార్ అనేది తమిళనాడు, కేరళ, శ్రీలంకలో నివసించే అత్యంత పురాతనమైన, గౌరవప్రదమైన భూస్వామ్య, వ్యవసాయ సామాజిక వర్గం. ‘వేలన్మై’ అంటే వ్యవసాయం చేసే వారుగా వీరు ప్రసిద్ధి. సంఘం కాలం నుండి ఉన్న అత్యున్నత సామాజిక వర్గాలలో ఒకటిగా వీరు పరిగణించబడుతున్నారు. తమిళంలో ‘వెల్’ అంటే ఈటె, ‘అలర్’ అంటే సాగుదారుడు. అంటే వీరు సాగుతో పాటు యుద్ధ తంత్రంలోనూ ప్రావీణ్యం కలవారని అర్థం.
చోళులు, పాండ్యులు, పల్లవుల కాలంలో వెల్లాలర్లు ఉన్నత స్థాయి యోధులుగా, పరిపాలనా అధికారులుగా, కోటల నిర్వాహకులుగా కీలక బాధ్యతలు నిర్వహించారు. శతాబ్దాలుగా వీరు తమిళ రాజకీయాల్లో ఆధిపత్య వర్గంగా కొనసాగుతున్నారు.
వెల్లాలార్ అనేది ఒక పెద్ద సమూహం, ఇందులో అనేక ఉపకులాలు ఉన్నాయి,
- కొంగు వెల్లలార్ (గౌండర్)
- తుళువ వెల్లలార్
- చోళియ వెల్లలార్
- కర్కతార్ వెల్లలార్
- దేవేంద్ర కుల వెల్లలార్
ఈ సామాజిక వర్గం వారు సాధారణంగా తమ పేర్ల చివర పిళ్లై, మొదలియార్, గౌండర్ వంటి బిరుదులను ఉపయోగిస్తారు. తమిళనాడు జనాభాలో సుమారు 33 శాతం ఉన్న ఈ వర్గం, రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను శాసిస్తోంది. ప్రస్తుతం విజయ్ పార్టీకి వస్తున్న భారీ ఆదరణ వెనుక ఈ బలమైన సామాజిక సమీకరణలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
