BIG BREAKING : ఏం పీక్కుంటారో పీక్కొండి.. నేను రాజీనామా చేయను : మమత సంచలనం

Mamata Banerjee

BIG BREAKING : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అనూహ్య ఓటమిని చవిచూడటంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్ తన పార్టీపై నీచమైన ఆటలు ఆడిందని ఆరోపించారు. రాష్ట్రంలో తన ప్రభుత్వం ఓడిపోలేదని, సీట్ల లూటీ జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సుదీర్ఘకాలం పాటు మమతా బెనర్జీకి అజేయమైన కోటగా ఉన్న బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా జెండా ఎగురవేసింది. మొత్తం 294 స్థానాలకు గానూ బీజేపీ 207 సీట్లను కైవసం చేసుకుని భారీ మెజారిటీని సాధించింది. మరోవైపు, అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తిన్నది. ఈ విజయంతో మే 9వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.

మమతా బెనర్జీకి వ్యక్తిగతంగా కూడా ఈ ఎన్నికలు పెద్ద దెబ్బ మిగిల్చాయి. తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో మాజీ అనుచరుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 2011 నుండి ముఖ్యమంత్రిగా ఉన్న మమతకు, తన కోటలోనే పరాభవం ఎదురుకావడం గమనార్హం. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కింద దాదాపు 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించడం వల్లే ఇలా జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు.

బెంగాల్ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు భయం నుండి విముక్తి పొందారని, ఇకపై రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.