Tamil Nadu : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 35 శాతం ఓట్లతో, సుమారు 1.7 కోట్ల ఓట్లను కొల్లగొట్టి ప్రభంజనం సృష్టించింది. స్పష్టమైన మెజారిటీకి కొంచెం దూరంలో ఆగిపోయినప్పటికీ, అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఈ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. తన కంచుకోట అయిన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తొమ్మిదిసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన స్టాలిన్‌కు ఇది మొదటి ఓటమి. డీఎంకే ప్రభుత్వంలోని 32 మంది మంత్రులు పోటీ చేయగా, అందులో ఏకంగా 15 మంది ఘోర పరాజయం పాలయ్యారు. ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేపాక్-ట్రిప్లికేన్ నుండి గెలిచారు. మంత్రులు మా. సుబ్రమణియన్, పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్, అన్బిల్ మహేష్ వంటి కీలక నేతలు టీవీకే అభ్యర్థుల చేతిలో ఓటమి చెందారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ (సాత్తూరు), మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (మైలాపూర్) ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై కూడా భారీ తేడాతో ఓడిపోయారు.పీఎంకే నుండి సౌమ్య అన్బుమణి (ధర్మపురి), డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ (విరుదుచలం) విజయం సాధించారు. అయితే, ప్రేమలత కుమారుడు విజయ్ ప్రభాకరన్ విరుదునగర్‌లో ఓడిపోయారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా డీఎంకే కూటమి ఓటమి పాలుకావడానికి, మంత్రులు కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా “సనాతన ధర్మం”పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఎన్నికల్లో డీఎంకే పాలిట శాపంగా మారాయని క్షేత్రస్థాయి గణాంకాలు చెబుతున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో సాధారణంగా ద్రవిడ సిద్ధాంతం బలంగా ఉంటుంది. అయితే, ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. గతంలో హిందూ ఓటర్లు డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య చీలిపోయేవారు. కానీ ఈసారి ఉదయనిధి వ్యాఖ్యల వల్ల మౌనంగా ఉన్న హిందూ ఓటర్లంతా ఏకమై డీఎంకేకు వ్యతిరేకంగా ఓటు వేశారని అర్థమవుతోంది.
మరోవైపు, టీవీకే అధినేత విజయ్ చాలా తెలివిగా వ్యవహరించారు. ఆయన తన ప్రసంగాల్లో ఎక్కడా మతాన్ని కించపరచకుండా, అందరినీ కలుపుకుపోయే ధోరణిని ప్రదర్శించారు. ఉదయనిధి మాటల వల్ల విసిగిపోయిన ఓటర్లకు విజయ్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించారు. టీవీకే సాధించిన 35 శాతం ఓటు షేరులో అత్యధిక భాగం డీఎంకే నుండి చేజారిన హిందూ ఓటర్లదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
