Vijay :దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం తమిళనాడులో ఒక పెను తుఫానును సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో టీవీకే (TVK) ముందంజలో ఉండటంతో, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయేలా కనిపిస్తోంది.
అయితే, విజయ్ రాజకీయ ప్రవేశం అకస్మాత్తుగా జరిగింది కాదని, దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు. 2024లో వచ్చిన విజయ్ హిట్ చిత్రం “GOAT” (The Greatest of All Time) లో ఆయన వాడిన కారు నంబర్ ప్లేట్ TN 07 CM 2026 ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల విశ్లేషణ ప్రకారం.. TN అంటే తమిళనాడు, CM అంటే చీఫ్ మినిస్టర్, 2026 అంటే ఎన్నికలు జరిగే ఏడాది. అంటే 2026లో తానే ముఖ్యమంత్రిని అవుతానని విజయ్ రెండేళ్ల క్రితమే తన సినిమా ద్వారా సింబాలిక్ గా చెప్పారని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అప్పట్లో విజయ్ తో కలిసి నటించిన నటుడు ప్రేమ్ జీ అమరన్ కూడా 2026లో విజయ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, తాను ఆయనకే ఓటు వేస్తానని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు నిజమవుతున్నట్లు కనిపిస్తుండటం విశేషం.
విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు నటించిన చివరి చిత్రం “జననాయకన్” (Jana Nayagan). సెన్సార్ సమస్యలు, లీకుల వల్ల ఆలస్యమైన ఈ సినిమా చివరకు మే 8న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో, సినిమా కలెక్షన్లపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల జోష్ లో ఈ జననాయకుడు వెండితెరపై ఎలా కనిపిస్తాడో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
