Petrol Prices : ఇరాన్‌లో పెట్రోల్ ధరలు వింటే షాక్ అవుతారు… డీజిల్ మరీ ఇంత చీపా!

Petrol Prices

Petrol Prices : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడిని భయపెడుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో భారత్‌లో పెట్రోల్, టీజల్, వంటగ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న వాహనదారులు, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే తమ నెలవారీ బడ్జెట్ తలకిందులవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రపంచమంతా ఇంధన ధరల సెగతో ఉడికిపోతుంటే.. యుద్ధానికి కేంద్రమైన ఇరాన్‌లో మాత్రం పెట్రోల్ ధరలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. మన దేశంలో ఒక లీటర్ వాటర్ బాటిల్ కొనే ధరతో ఇరాన్‌లో ఏకంగా 10 లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేయవచ్చు.

ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువు, చమురు నిల్వలు ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. అందుకే అక్కడ ఇంధనం అంత చౌకగా లభిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం తన పౌరులకు ప్రపంచంలోనే అత్యధికంగా ఇంధన సబ్సిడీలను అందిస్తుంది. చమురు అనేది జాతీయ సంపద అని, దాని వల్ల ప్రజలందరికీ ప్రయోజనం చేకూరాలని అక్కడి ప్రభుత్వం నమ్ముతుంది. దీనికి తోడు ఇరాన్ వద్ద భారీగా చమురు నిల్వలు ఉండటం వల్ల వారు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల రవాణా ఖర్చులు, పన్నుల భారం ఉండదు. కేవలం సొంతంగా ఉత్పత్తి చేసుకునే ఖర్చుతోనే ప్రజలకు పెట్రోల్ అందిస్తున్నారు.

ఇరాన్‌లో పెట్రోల్ అమ్మకాల కోసం ఒక ప్రత్యేకమైన కోటా విధానం అమలులో ఉంది. ప్రతి పౌరుడికి నెలకు కొంత నిర్ణీత కోటాను కేటాయిస్తారు. మొదటి 60 లీటర్ల పెట్రోల్‌ను కేవలం 15,000 ఇరానీ రియాల్స్ కే అందిస్తారు. అంటే మన భారతీయ కరెన్సీలో లీటర్ పెట్రోల్ ధర దాదాపు రూ. 1.30 మాత్రమే! ఒకవేళ 60 లీటర్ల పరిమితి దాటితే అప్పుడు ‘ఫ్రీ మార్కెట్ రేటు’ ప్రకారం పెట్రోల్ కొనాలి. ఆ ధర కూడా మనకంటే చాలా తక్కువగా అంటే లీటర్ రూ. 2.50 నుండి రూ. 3 వరకు మాత్రమే ఉంటుంది.

ఇక డీజిల్ విషయానికి వస్తే పరిస్థితి ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కోటాలో లీటర్ డీజిల్ కేవలం 25 పైసలకే లభిస్తుండగా, కోటా ముగిశాక 50 పైసల వరకు విక్రయిస్తున్నారు. అయితే, ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగినా లేదా ఇరాన్‌లోని చమురు శుద్ధి కర్మాగారాలు దాడుల్లో దెబ్బతిన్నా అక్కడ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఇరాన్ ప్రభుత్వం తన సబ్సిడీలను తగ్గించక తప్పదు. కానీ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత చౌకగా పెట్రోల్ వాడుతున్న వారు ఇరాన్ పౌరులే కావడం విశేషం.