Srikakulam : ఇంటికి రా.. విద్యార్థినిపై ప్రొఫెసర్ వేధింపులు.. బయటపడ్డ ఆడియో!

Srikakulam

Srikakulam : విద్య నేర్పించి సంస్కారాన్ని నేర్పాల్సిన గురువే కామరూపం దాల్చాడు. తన దగ్గర చదువుకుంటున్న విద్యార్థినిపై కన్నేసి, లొంగదీసుకోవాలని చూసిన ఓ ప్రొఫెసర్ బాగోతం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మజ్జి రామారావు అరాచకాలు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాయి.

యూనివర్సిటీలో ఫస్ట్‌ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థినికి సదరు ప్రొఫెసర్ వరుసగా ఫోన్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. “ఒకసారి నా ఇంటికి రా.. మనం కలిసి ప్రయాణం చేద్దాం” అంటూ అసభ్యకరమైన ప్రతిపాదనలు పెట్టాడు. అంతటితో ఆగకుండా, తన మాట వినకపోతే కెరీర్ నాశనం చేస్తాననే రీతిలో బెదిరింపులకు దిగాడు. “ఇంకా నీకు ఎనిమిది సెమిస్టర్లు ఉన్నాయి.. గుర్తుంచుకో” అంటూ సదరు విద్యార్థినిని మానసిక ఒత్తిడికి గురిచేశాడు.

ప్రొఫెసర్ రామారావు చేసిన వెకిలి చేష్టలు, అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నంలా వ్యాపిస్తున్నాయి. విద్యార్థినిని లోబర్చుకోవడానికి ఆయన వాడిన పదజాలం విన్న నెటిజన్లు, విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

బాధిత విద్యార్థిని ధైర్యం చేసి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వర్సిటీ యంత్రాంగం ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా తొక్కేసే ప్రయత్నం చేయడం గమనార్హం. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, ప్రొఫెసర్‌తో రాజీ కుదిర్చేందుకు అధికారులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మరింత దారుణమైన విషయం ఏంటంటే.. రాజీ కుదురుస్తున్న సమయంలో కూడా సదరు ప్రొఫెసర్ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. “నువ్వు ఎలా పాస్ అవుతావో నేను చూస్తా” అంటూ బాధితురాలిని అందరి ముందే హెచ్చరించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

ప్రస్తుతం ఈ ఉదంతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యా దేవాలయంలో ఇలాంటి కీచక పర్వానికి తెరలేపిన ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది.