Lungi Ngidi : ఐపీఎల్లో బిగ్ షాక్: తలకు తీవ్ర గాయం..స్టేడియంలోకి అంబులెన్స్‌!

Lungi Ngidi

Lungi Ngidi :  అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ లుంగీ ఎన్గిడికి ఘోర ప్రమాదం జరిగింది. క్యాచ్ పట్టే ప్రయత్నంలో ఆయన తలకు తీవ్రమైన దెబ్బ తగలడంతో స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఢిల్లీ ఇన్నింగ్స్ మూడవ ఓవర్లో ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు మిడ్-ఆఫ్ నుంచి ఎన్గిడి వేగంగా పరిగెత్తుకు వచ్చారు. అయితే గాలిలో ఉన్న బంతిని అంచనా వేయడంలో ఆయన పొరబడ్డారు. బంతిని అందుకునే క్రమంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి వెల్లకిలా పడిపోవడంతో, ఆయన తల వెనుక భాగం బలంగా నేలకు తగిలింది.

ఆయన పడిపోయిన తీరును చూసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కుల్దీప్ యాదవ్, డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్లు ఆందోళనగా ఆయన వద్దకు పరుగులు తీశారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు.

ముందస్తు జాగ్రత్తగా మెడికల్ టీమ్ ఎన్గిడి మెడకు ‘నెక్ బ్రేస్’ అమర్చి, వెంటనే స్ట్రెచర్‌ను రప్పించారు. గాయం తీవ్రత దృష్ట్యా మైదానంలోకి అంబులెన్స్‌ను కూడా తీసుకురావాల్సి వచ్చింది. అయితే, వైద్యులతో ఎన్గిడి మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించడం కొంత ఊరటనిచ్చే అంశం.

ఈ సంఘటన జరుగుతున్న సమయంలో పంజాబ్ కింగ్స్ కోచ్ రికీ పాంటింగ్ కూడా మైదానంలోకి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్గిడి స్థానంలో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా దుష్మంత చమీర వార్మప్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్గిడిని తదుపరి చికిత్స మరియు పరీక్షల నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి రిపోర్టులు వస్తేనే గాయం తీవ్రతపై పూర్తి స్పష్టత రానుంది.