BIG BREAKING : ఇరాన్ సంచలనం.. మళ్లీ హార్ముజ్ జలసంధి క్లోజ్!

Strait of Hormuz

BIG BREAKING :  అమెరికా తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ఇరాన్ సైన్యం శనివారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’ని తిరిగి తన పూర్తి నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అమెరికా తన ఓడరేవులపై దిగ్బంధనాన్ని (బ్లాకేడ్) ఇంకా కొనసాగిస్తూనే ఉందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ సైనిక కమాండ్ స్పష్టం చేసింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, శుక్రవారమే ఇరాన్ ఈ మార్గాన్ని తెరిచినప్పటికీ, కేవలం ఒక్క రోజులోనే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇరాన్ జలసంధిని తెరవడాన్ని ట్రంప్ స్వాగతించినప్పటికీ, ఇరాన్‌తో పూర్తిస్థాయి అణు ఒప్పందం కుదిరే వరకు తమ నౌకాదళం ఆ దేశ ఓడరేవులపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఇరాన్‌తో తమ లావాదేవీలు వంద శాతం పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. దీంతో అమెరికా మోసపూరితంగా వ్యవహరిస్తోందని, బ్లాకేడ్ పేరుతో సముద్రపు దొంగతనాలకు పాల్పడుతోందని ఇరాన్ విమర్శించింది.

ఈ కొత్త ఆంక్షల నేపథ్యంలో, ఇరాన్ పార్లమెంటరీ కమిటీ చీఫ్ ఇబ్రహీం అజీజీ కీలక విషయాలను వెల్లడించారు. ఇకపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) అనుమతి ఉన్న వాణిజ్య నౌకలను మాత్రమే ఈ మార్గం గుండా వెళ్ళనిస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా, ఈ మార్గాన్ని ఉపయోగించుకునే నౌకలు కచ్చితంగా ‘టోల్ ఫీజు’ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా తమ నౌకలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే వరకు హార్ముజ్ జలసంధిపై తమ పహారా కఠినంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, గ్యాస్‌లో దాదాపు 20 శాతం ఈ హార్ముజ్ జలసంధి గుండానే వెళుతుంది. గత ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ఆ తర్వాత ఇరాన్ ఎదురుదాడుల వల్ల దాదాపు 47 రోజుల పాటు ఈ మార్గం మూతపడింది. దీనివల్ల ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయి వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడంతో అంతర్జాతీయంగా ఆందోళన మొదలైంది. అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ఈ మార్గం తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ గట్టిగా హెచ్చరించారు.