Hyderabad : హెల్మెట్‌తో అత్తను చంపిన అల్లుడు… చెంగిచర్లలో ఘోరం

Hyderabad

Hyderabad  : మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో అత్యంత పాశవికమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లుడే కాలయముడిగా మారి, హెల్మెట్‌తో కొట్టి అత్త ప్రాణాలు తీసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫిట్స్ వచ్చి పడిపోయిందని నమ్మించి, అత్తను ఆసుపత్రిలో చేర్పించి ఏమీ తెలియనట్టు నటించిన అల్లుడి అసలు రంగు సీసీటీవీ ఫుటేజీతో బయటపడింది.

హైదరాబాద్‌కు చెందిన కావ్య అనే యువతి, కరీంనగర్‌కు చెందిన స్నేహిత్ అనే యువకుడు ప్రేమించుకుని గతేడాది వివాహం చేసుకున్నారు. అయితే వివాహం జరిగినప్పటి నుండి వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవలు జరుగుతూ ఉండేవి. స్నేహిత్ తాను ఒక పెద్ద కంపెనీలో ఆఫీసర్‌నని, గిన్నెలు తోముకునే కావ్యను పెళ్లి చేసుకున్నానంటూ అహంకారంతో మాట్లాడేవాడని సమాచారం. ఈ క్రమంలోనే ఘటనకు ముందు రోజు కావ్యతో గొడవపడిన స్నేహిత్, తన అత్త అరుణకు ఫోన్ చేసి “నీ కూతురు చిన్న విషయాలకే అలుగుతోంది” అంటూ ఫిర్యాదు చేశాడు.

ఏప్రిల్ 29న అరుణ తన షాపు పని నిమిత్తం బయటకు వెళ్లగా, తిరిగి వచ్చే క్రమంలో స్నేహిత్ ఆమెను కలిశాడు. బైక్‌పై దించుతానని నమ్మించి ఆమెను ఎక్కించుకున్నాడు. చెంగిచెర్ల ఆర్‌టీసీ కాలనీ సమీపంలోకి రాగానే, వెనుక కూర్చున్న అత్త తలపై తన హెల్మెట్‌తో బలంగా బాదాడు. ఆ దెబ్బకు అరుణ ఒక్కసారిగా పట్టు కోల్పోయి బైక్‌పై నుంచి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది.

దాడి అనంతరం స్నేహిత్ అత్యంత తెలివిగా తన భార్య కావ్యకు ఫోన్ చేసి, అత్తమ్మకు అకస్మాత్తుగా ఫిట్స్ (మూర్ఛ) వచ్చి బైక్ పై నుంచి పడిపోయిందని అబద్ధం చెప్పాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. అయితే పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు అరుణ చికిత్స పొందుతూ మృతి చెందారు.

తన తల్లి మరణంపై, భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన కావ్య.. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించింది. ఆ వీడియోలో స్నేహిత్ హెల్మెట్‌తో అత్తను కొట్టడం, ఆమె కింద పడిపోవడం స్పష్టంగా కనిపించడంతో అసలు నిజం బయటపడింది. వెంటనే కావ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.